Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‌లో పెనుసంచలనం నమోదయ్యింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఘోర ఓటమిపాలైంది. దీంతో వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. చేధనకు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు చతికిలపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగారు. నెదర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. బ్రాండన్ గ్లోవర్ 3, ఫ్రెడ్ క్లాసెన్ 2 వికెట్లు, బాస్ డె లీడే 2, పౌల్ వాన్ మీకెరన్ 1 చొప్పున వికెట్లు తీశారు. దీంతో సౌతాఫ్రికాకు అనూహ్య పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. 25 పరుగులు చేసిన రిలీ రూసో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే.. డికాక్(13), బావూమా(20), మార్‌క్రమ్(17), డేవిడ్ మిల్లర్ (17), క్లాసెన్ (21), వేన్ పార్నెల్ (0), కేశవ్ మహరాజ్ (13), కగిసో రబడ(9 నాటౌట్), అన్రిచ్ నోర్జె (4 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ బ్యాటింగ్‌లోనూ రాణించింది. ఓపెనర్లు ఎంబర్గ్ (37), మ్యాక్స్ డౌడ్(29) పరుగులు చేసి చక్కటి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత టామ్ కూపర్ (35), అకెర్‌మాన్(41 నాటౌట్), డీ లెడే(1), ఎడ్వర్డ్స్ (12 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో నెదర్లాండ్ విజయంతో ముఖ్యపాత్ర పోషించిన అకెర్‌మాన్(41 నాటౌట్)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్ దక్కింది.