Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుల విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. ఎన్నికల సంఘం ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ కాసేపటి క్రితం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతు ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేనన్న వికాస్ రాజ్ అందుకు కారణాలు కూడా తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న కారణంగానే ఓట్ల లెక్కింపు అనుకున్న దాని కంటే ఆలస్యంగా జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతున్న వైనాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయా రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఐదుగురు, ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు.. అందుకు విరుద్ధంగా మునుగోడులో ఏకంగా 47 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన తెలిపారు. రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు (అబ్జర్వర్)లతో పాటు ఆయా అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఆరోపణలను ప్రస్తావించగా తన వద్దకు ఇప్పటిదాకా ఓట్ల లెక్కింపుపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని. ఫిర్యాదు అందితే దానిని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.