Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు గెలుపు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా అహంకారానికి చెంపపెట్టని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి, ఆత్మగౌరవానికి ప్రజలు పట్టంకట్టారని ప్రశంసలు కురిపించారు. నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టి చరిత్ర లిఖించారని కొనియాడారు. టీఆర్ఎస్‌ను గెలిపించిన మునుగోడు ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన వామపక్ష నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. డబ్బు, అక్రమాలతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూసిందని, ఆ పార్టీ నేతల ధన అహంకారానికి మునుగోడు ప్రజలే బుద్ధి చెప్పారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో క్రూరమైన రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపిందని దుయ్యబట్టారు. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని అమిత్‌షా వెనకుండి నడిపించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా మెజార్టీ వచ్చేది కానీ.. డబ్బుతో ఓటర్లను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. మునుగోడు ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే.. రూ.కోటితో దొరికిన నేత.. బండి సంజయ్ అనుచరుడేనని కేటీఆర్ ఆరోపించారు.