Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గత నెల 15న విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరిగిన రోజే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. అప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడికి పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘర్షణ జరిగిన సమయంలో విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్న పశ్చిమ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ ఏసీపీ టేకు మోహనరావు, సీఐ ఉమాకాంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఉమాకాంత్‌ను నగర పోలీస్ కమిషనర్ వీఆర్ (వేకెన్సీ రిజర్వు)కు పంపించారు. తాజాగా, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.