Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన టాలీవుడ్ కమెడియన్ అలీ ఇటీవల ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులవడం తెలిసిందే. ఈ క్రమంలో అలీ నేడు బాధ్యతలు చేపట్టారు. అధికారులు వెంట రాగా తన చాంబర్ లో ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తాను ఏంచేయాలన్నది ఓ వారంలో ఖరారవుతుందని వెల్లడించారు. సీఎం జగన్ మనసున్న మనిషి అని, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు. సీఎం జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెడతానని అలీ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఇటీవల తాను షూటింగ్ కు వెళ్లానని, అక్కడ బీచ్ లు, రోడ్లు చూసిన తర్వాత, వాటిని డెవలప్ చేస్తే తెలుగు సినిమాలే కాకుండా పర భాషా చిత్రాలు కూడా ఇక్కడ షూటింగులు జరుపుకుంటాయని అనిపించిందని అలీ అభిప్రాయపడ్డారు. తద్వారా ఆ ప్రాంతంలో ఉపాధి లభిస్తుందని అన్నారు. మనం ఇంకా ఎదగాలని, తద్వారా రాష్ట్రం, దేశం ఎదుగుతాయని వివరించారు. అంతేతప్ప, చిన్న చిన్న అంశాలను పట్టుకుని మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు అనడం సబబు కాదని హితవు పలికారు. చిన్న గోడ కూలగొట్టినా ఇల్లు పడగొట్టినట్టు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుండడంపై ఎలా స్పందిస్తారని మీడియా ప్రతినిధి అడగ్గా, అలీ పైవిధంగా స్పందించారు.