Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... సోమవారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. తన అనుచరులు, ఎన్నికల్లో పనిచేసిన నేతలతో కలిసి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చిన ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డిని దీవించిన కేసీఆర్... నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్ కు ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం కష్టపడిన పార్టీ నేతలను కేసీఆర్ అభినందించారు. పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఆయా మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మునుగోడు అభివృద్ధికి కష్టపడాలని మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ సూచించారు.