Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్2022లో సెమీ-ఫైనల్ చేరింది. సూపర్-12 దశలో తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘనవిజయం సాధించి గ్రాండ్‌గా నాకౌట్‌లో ఎంటరైంది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సెమీ-ఫైనల్ చేరింది. అయినప్పటికీ జింబాబ్వేపై మ్యాచ్‌లో టీమిండియా మార్పులతో బరిలోకి దిగింది. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ దినేష్ కార్తిక్‌ను పక్కనపెట్టింది. అప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ స్థానంలో మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో పంత్ రాణించకలేకపోయాడు. అయినప్పటికీ భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
అయితే ఇలా జట్టులో మార్పు చేయడంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కార్తీక్ స్థానంలో పంత్ తీసుకున్న మేనేజ్‌మెంట్ వ్యూహం నచ్చలేదని కుండబద్ధలుకొట్టాడు. దినేష్ కార్తీక్ విషయంలో రిస్క్ చేయాలనుకుంటే టోర్నీ మొత్తం అతడినే ఆడించాల్సిందని వ్యాఖ్యానించాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అప్పటికే సెమీస్‌కు అర్హత సాధించడంతో పంత్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్టు రోహిత్ శర్మ అన్నాడు. మొదటి బ్యాటింగ్ కాబట్టి ఫినిషర్ అవసరంలేదన్నాడు. లక్ష్య చేధనలో మాత్రమే ఫినిషర్ అవసరమని చెప్పాడు. అలాంటప్పుడు జింబాబ్వేనే మొదట బ్యాటింగ్ చేయించాల్సింది కదా. ఆశిశ్ నెహ్రా చెప్పినట్టు.. ఒకవేళ పంత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడి ఉంటే అతడిని కొనసాగిస్తారా లేదా దినేష్ కార్తీక్‌ను తీసుకుంటారా సెహ్వాగ్ విశ్లేషించాడు. సెమీ-ఫైనల్‌కు ముందు దినేష్ కార్తీక్‌ని జట్టు నుంచి డ్రాప్ చేస్తే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌పై ఆడించాలనుకుంటే జింబాబ్వేపై మ్యాచ్‌లో అతడిని పక్కనపెట్టాల్సింది కాదని అన్నాడు. కాగా ఈ గురువారం ఆడిలైడ్ వేదికగా రెండవ సెమీ-ఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తలపడనున్నాయి.