Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీల్లి: ఆదివారం అర్ధరాత్రి నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీల సందర్భంలో రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగు నుంచి పోలీసులు విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను స్వాధీనం చేసుకున్నారు. 52 ఏళ్ల మహిళ నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఝార్ఖండ్‌లోని టాటానగర్ మీదుగా ఢిల్లీకి విదేశీ పాములను తరలిస్తున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టాటానగర్‌లో రైలును ఆపి జనరల్ బోగీలో తనిఖీలు చేశారు. ఈ తరుణంలో ఆమె వద్దనున్న బ్యాగులో 29 విషపూరిత విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తనది పూణె అని తేలింది. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి తనకు ఈ బ్యాగ్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించినట్టు పోలీసులకు తెలిపింది. రైల్వే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న పాములు, బల్లులు, సాలీళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.