Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో లౌకికవాదులు, సీఎం కేసీఆర్ గెలిచారన్నారు. మునుగోడులో మతోన్మాద, విచ్ఛిన్నకరులకు చెంపపెట్టులా తీర్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికలు ప్రజల ఆకాంక్షలను వెల్లడించాయని, తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని మరోసారి రుజువైందన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రం ఐటీ డిపార్ట్‌మెంట్‌ను కూడా వాడారని ఆయన విమర్శించారు. ఇది అత్యంత దుర్మార్గమని, ఇప్పటికే ఈడీ, సీబీఐ నవ్వుల పాలయ్యాయని, తాజాగా ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్‌ను సైతం దిగజార్చారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం చాలా ఉందన్న ఆయన సామాన్య ఆకాంక్షలు నెరవేర్చేలా కేసీఆర్ పాటుపడుతారని, దేశ ప్రజలకు ఆ నమ్మకం పెరిగిందన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఇవాళ తెలంగాణ మోడల్ దేశానికి అవసరమన్నారు. ఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని, సామాన్యులకు శరాఘాతంగా కేంద్ర పాలన మారిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు.