Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన ఓ హైదరాబాదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తల్లిదండ్రులు కోరారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌కు చెందిన పీ రామచంద్ర(రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్), రాజేశ్వరి దంపతుల కుమారుడు పీ ఉదయ్ కుమార్(28) ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2018లో తొలిసారిగా ఇటలీకి వెళ్లాడు. రోమ్‌లోని ఓ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా 2020లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాడు. కరోనా వ్యాప్తి తగ్గడంతో 2021లో మళ్లీ ఇటలీ వెళ్లాడు. రోమ్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే నవంబర్ 4వ తేదీన ఉదయ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు మెయిల్ వచ్చింది. అసలేం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు స్నేహితులకు, తెలిసిన వారికి కాల్ చేయగా, సరైన సమాచారం లభించలేదు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రామచంద్ర, రాజేశ్వరి కలిశారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉదయ్ కుమార్ మృతికి గల కారణాలను తెలుసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే డెడ్ బాడీని కూడా వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటలీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.