Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మనీలాండరింగ్ ఆరోపణలతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ సంజయ్ రౌత్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు బుధవారం ముంబైలోని స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మూడున్నర నెలల తర్వాత సంజయ్ రౌత్ జైలు నుంచి బయటకి రానున్నారు. పత్రాచాల్ ఏరియా పునరాభివృద్ధికి సంబంధించి ఎంపీ సంజయ్ రౌత్ పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో గత జులైలో ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంజయ్ ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. అప్పటి నుంచి సంజయ్ రౌత్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం సంజయ్ రౌత్ పలుమార్లు పిటిషన్ పెట్టుకున్నా కోర్టు తిరస్కరించింది. ఇటీవలే రౌత్ కస్టడీని మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. కిందటి వారంలోనే బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించింది. తీర్పును మాత్రం వారం పాటు రిజర్వ్ చేసింది. తాజాగా రౌత్ కు బెయిల్ ఇస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చినపుడు రౌత్ పలుమార్లు మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై తప్పుడు కేసు బనాయించారని రౌత్ తెలిపారు.