Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి తొలగించాలని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కేరళలోని తొమ్మిది యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించి గవర్నర్ ఆదేశాన్ని సవాల్ చేశారు. మరోవైపు ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై సీఎం విజయన్ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి ఆయనను తప్పించేందుకు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ దీనిపై సంతకం చేస్తేనే అది అమలులోకి వస్తుంది. గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలుపుతూ ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.