Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దొంగతనాలకు పాల్పడేవారిని హడలెత్తించే పోలీసుల తుపాకీనే ఎత్తుకెళ్లాడో ఘనుడు. తుపాకీనే కాదు పోలీస్ యూనీఫాం, పది కాట్రిజ్‌లును కూడా దొంగిలించాడు. అదీ పోలీస్ స్టేషన్ నుంచే. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమే. పోలీసులకే సవాల్‌గా నిలిచిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. కాన్పూర్‌లోని న్యూ ఆజాద్ నగర్ పరిధిలోని బిద్నూ ఔట్‌పోస్టులో గత రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసు పిస్తోల్‌తోపాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జీ సుధాకర్ పాండే కేసు నమోదుచేశారు. అయితే విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ.. సుధారక్ పాండేపై వేటువేశారు. పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్‌లు కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.