Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్, జైకుమార్‌ను కూడా విడుల చేయాలని ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. మే 17న ఈ కేసులో మరో దోషిగా ఉన్న పేరరివాళన్‌ను విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేశామని.. అది వీరికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే పేరరివాళన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసులోని దోషులు దాదాపు 30 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. ప్రవర్తన కూడా బాగానే ఉండడంతో.. వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. ఐతే ఆ మరుసటి ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. 2000లో సోనియా గాంధీ జోక్యంతో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగారశిక్ష తగ్గించారు.