Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని తొలగించాలంటూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్షలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో చేనేత ముఖ్య భూమిక పోషించిందని, చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీకి గాంధీజీ సైద్ధాంతిక విధానాన్ని గుర్తు చేయడానికి తాము గుజరాత్ వచ్చామని తెలిపారు. గ్రామ స్వరాజ్యం, గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన గాంధీజీ నివాసమైన సబర్మతి ఆశ్రమం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని చేనేతపై పన్ను తొలగించాలని కోరుతున్నామని తెలిపారు.
చేనేతపై పన్నులు వేయమంటే అది గాంధీజీ సిద్ధాంతానికి విరుద్ధమని అన్నారు. చేనేత రంగాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చేనేత రంగ బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించి, చేనేత రంగానికి అనేక పథకాలను, రాయతీలను ఇవ్వాలని కోరారు. చేనేతపై జీరో జీఎస్టీ, జాతీయ చేనేత విధానంపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.