Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదక్: ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చుకోవాలని
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత, ట్రాన్స్‌పోర్ట్ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గోదాముల్లో ధాన్యం నిల్వకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరిస్థితులను బట్టి ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ 2015లో 24లక్షల మెట్రిక్ టన్నులు జరిగితే 2020 నాటికి 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. అయితే, ఇందుకు అనుగుణంగా మిల్లింగ్ శాతం పెరగలేదని దీంతో ఇబ్బంది కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా చూస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నామని, లారీల సమస్య, అన్లోడింగ్ త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమావేశంలో డీఎస్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.