Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ద్వీప దేశమైన టోంగాకు సమీపంలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలను ఆ దేశం జారీ చేసింది. అయితే అమెరికాకు చెందిన సమోవా దీవిని సునామీ రాకాసి అలలు తాకాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళన చెందారు. పసిఫిక్ మహా సముద్రంలోని టోంగా ద్వీపానికి 207 కిలో మీటర్ల దూరంలోని సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సముద్రంలోని 24.8 కిలోమీటర్ల లోతులో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
కాగా, సముద్రం లోపల భూకంపం సంభవించడంతో టోంగా దేశం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ అలలు వచ్చే అవకాశమున్నదని హెచ్చరించింది. తమ దీవుల్లోని ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. అలాగే అమెరికాకు చెందిన సమోవా దీవికి సునామీ ముప్పు ఎక్కువని హెచ్చరించింది. మరోవైపు సమోవా దీవిని సునామీ అలలు తాకాయి. దీంతో ఆ దీవిలోని ప్రజలు ముందు జాగ్రత్తగా ఎత్తైన ప్రాంతాలకు చేరుకున్నారు.