Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎడ్యుటెక్ స్టార్టప్ ‘ఫిజిక్స్ వాలా’ పేరు వినే ఉంటారు. ఇదొక యూట్యూబ్ ఛానెల్. జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే చాలామందికి ఈ ఛానెల్ ద్వారా ఫిజిక్స్ పాఠాలు చెప్తారు. ఇప్పటివరకూ ఫిజిక్స్ పాఠాల వరకూ పరిమితమైన నిర్వాహకులు ‘యూపీఎస్సీ వాలా’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను మొదలుపెట్టారు. ‘యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అభ్యర్థులకు తక్కువ ఖర్చుకే ఉపయుక్తమైన సమాచారాన్ని అందించాలనేది మా లక్ష్యం. ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూపీఎస్సీతో పాటు ఇతర పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేవాళ్లకు సాయపడాలనేది మా ఆలోచన’ అని సీఈవో అలఖ్ పాండే ఒక ప్రకటనలో చెప్పాడు. 2023, 2024లో యూపీఎస్సీ పరీక్షలు రాసేవాళ్లకు ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు కోర్సులను అందించనున్నారు.
అలఖ్ పాండే 2016లో రూ.30 వేల పెట్టుబడితో ఫిజిక్స్ వాలా అనే యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించాడు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు జేఈఈ, నీట్ పరీక్షల కోసం ఉచితంగా ఫిజిక్స్ పాఠాలు చెప్పేవాడు. తన టీచింగ్ స్టయిల్‌తో అలఖ్ కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఎడ్యుటెక్ కంపెనీల్లో ఫిజిక్స్‌వాలా టాప్‌లో ఉంది. ఈ ఛానెల్‌కు 90 లక్షల మందికి పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.