Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని, ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానన్నారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారన్నారు. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు. స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని కేటీఆర్ అన్నారు. షోయబ్ ఉల్లా ఖాన్ తెలంగాణ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం పోషించిన పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. పత్రికా యాజమాన్యం కంటే తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. పత్రికలు చదవకుంటే ఏమీ తెలియదు చదివితే ఏది నిజమో తెలియదన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందన్నారు. నచ్చని జర్నలిస్టులకు చంపేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. 9 బిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్ ఉత్పత్తి చేసిందని, కరోనా వ్యాక్సిన్ల గురించి మన మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని వాపోయారు. జో బైడెన్ ప్రయాణించే హెలికాప్టర్ క్యాబిన్ కూడా హైదరాబాద్‌లోనే తయారయిందన్నారు. మిషన్ కాకతీయ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడంలేదన్నారు. చెరువు కట్టలు తెగితే వార్తకానీ బలంగా ఉంటే వార్త కాదా అన్నారు. భూగర్భ జలాలు లేకుంటే వార్త కానీ, భూగర్భ జలాలు పెరిగితే ప్రచురణార్హం కాదా అని వ్యాఖ్యానించారు.