Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గత నెలరోజులుగా క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరింది. రేపు (నవంబరు 13) మెల్బోర్న్ లో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని భావించిన పాకిస్థాన్ అనూహ్యరీతిలో పుంజుకుని సెమీస్ అడ్డంకిని దాటి ఫైనల్ చేరుకోగా, సెమీస్ లో టీమిండియాపై తిరుగులేని విజయంతో ఇంగ్లండ్ టైటిల్ సమరానికి సిద్ధమైంది.
ఈ రెండు జట్ల విజయావకాశాలను పరిశీలిస్తే ఫామ్ పరంగా క్రికెట్ విశ్లేషకులు ఇంగ్లండ్ కే ఓటేస్తున్నారు. అయితే చరిత్రను పరిశీలిస్తే 1992లో ఇంగ్లండ్, పాకిస్థాన్ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడగా, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాక్ జట్టే విజేతగా నిలిచింది. ఇప్పుడా చరిత్ర రిపీట్ అవ్వాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలో పాక్ ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తొలుత చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్... రెండో మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో దిగ్భ్రాంతికర పరాజయం చవిచూసింది. చివరికి నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించడంతో అదృష్టం కలిసొచ్చి పాక్ సెమీస్ చేరింది.