Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చనిపోయిన తండ్రిని బతికించేందుకు నరబలి కోసం పసిబాలుడ్ని ఒక మహిళ కిడ్నాప్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గర్హి ప్రాంతానికి చెందిన ఒక గర్భిణీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. కాగా, గురువారం ఒక మహిళ ఆ ఆసుపత్రికి వచ్చింది. రెండు రోజుల కిందట జన్మించిన పసిబాబు కుటుంబాన్ని కలిసింది. తాను ఒక ఎన్జీవో సంస్థ సభ్యురాలినని వారితో చెప్పింది. బాబు ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని చెప్పి వారిని తన వెంట తిప్పింది. ఆ రోజు సాయంత్రం ఆ పసికందును ఆమె కిడ్నాప్ చేసింది. బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. పసిబాబును కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలిని 25 ఏళ్ల శ్వేతగా గుర్తించారు. బాబు కిడ్నాప్‌పై ఆమెను ఆరా తీశారు. అయితే నవజాత శిశువును నరబలి ఇస్తే చనిపోయిన తన తండ్రి బతుకుతాడన్న మూఢ నమ్మకంతో ఈ పని చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.