Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో నకిలీ రూ.2 వేల నోట్లు దొరికాయి. వీటి విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉండనున్నది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీరి వెనకున్న ముఠా మూలాలను లాగే పనిలో నిమగ్నమయ్యారు.
నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ముఠా గుట్టును థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి భారీగా రూ. 2000 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రూ.8 కోట్ల విలువైన రూ.2000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగున్న సమయంలో.. అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ నోట్లను స్వాధీనపర్చుకున్నారు. ఈ కేసులో పాల్ఘర్‌కు చెందిన రామ్ శర్మ, రాజేంద్ర రౌత్‌లను థానే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నకిలీ నోట్లను ముద్రించిన ముఠా నుంచి నకిలీ రూ.2000 నోట్లున్న 400 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ ప్రింటర్ల నెట్‌వర్క్ ఎంత వరకు విస్తరించి ఉన్నదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మార్కెట్‌లో రూ.2000 నోట్ల కొరత ఉండడంతో మోసగాళ్లు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నకిలీ నోట్లను మార్కెట్‌కు తరలించే పనిలో ఉండగా పట్టుబడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని, లేదంటే పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చి సామాన్య ప్రజానీకం ఇబ్బందులపాలయ్యేదని పోలీసులు అంటున్నారు.