Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీఘఢ్: పంజాబ్‌లో గన్ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తుపాకీ సంస్కృతిని నిరోధించేందుకు భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్ ఆయుధ నియంత్రణలను కఠినతరం చేసింది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో పాటు తుపాకీ సంస్కృతి, హింసను ప్రేరేపించే పాటలపై నిషేధం విధించింది.
రాబోయే మూడు నెలల్లో ఆయుధాల లైసెన్సులను సమీక్షించాలని మాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు, ప్రార్ధనా స్ధలాలు, పెండ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలను తీసుకురావడం, వాటిని ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధించారు. నూతన గన్ లైసెన్స్‌లనూ జారీ చేయరాదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తప్పుడు వ్యక్తికి ఆయుధ లైసెన్సు జారీ చేసినట్టు వెల్లడైతే తక్షణమే దాన్ని రద్దు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆయుధాలను సోషల్ మీడియా వేదికలపై సహా బహిరంగంగా ప్రదర్శించడంపై నిషేధం విధించారు. గన్ వయలెన్స్ పెచ్చుమీరిందని విపక్ష పార్టీల నుంచి ఆప్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమృత్‌సర్‌లో శివసేన నేత సుధీర్ సూరిని సాయుధ దుండగులు ఇటీవల పట్టపగలే కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఇక ఫరీద్‌కోట్‌లో డేరా బాబా అనుచురుడు ప్రదీప్ సింగ్‌ను కొందరు కాల్చిచంపారు.