Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. ఇనుప ముక్కలు దొంగిలిస్తున్నారనే నెపంతో స్థానికులు ఇద్దరు వ్యక్తులను స్తంభానికి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. ముజఫర్‌పూర్ సమీపంలో కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ ఇనుప షెడ్లు వేశారు. అయితే గత వారం రోజులుగా ఆ షెడ్లలో ఉన్న ఇనుమును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెల్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారుకూడా పరుగులు తీశారు. అయితే కొద్ది దూరంలో ఉన్న ప్రజలు వారిని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేశారు. చేతులను స్తంభానికి కట్టి కొట్టడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను విడిపించి స్టేషన్‌కు తరలించారు. వారిద్దరు ఆ ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే వారిని కట్టేసి కొట్టడం ప్రారంభించిన గంట తర్వాత గాని పోలీసులు అక్కడికి చేరుకోలేదని, వారు వచ్చేవరకు నిందితులను స్థానికులు విచక్షణా రహితంగా దాడిచేశారని స్థానికులు వెల్లడించారు.