Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేరళలో సంచలనం సృష్టించిన 2013 నాటి హత్యకేసులో 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను దోషులుగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని అనవూర్‌కు చెందిన నారాయణన్ నాయర్ కుమారుడు శివప్రసాద్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ప్రాంతీయ కార్యదర్శిగా ఉండేవారు. ఆయనను హత్య చేసే ఉద్దేశంతో 5 నవంబరు 2013లో ఆయుధాలతో వచ్చిన దుండగులు నారాయణన్ ఇంట్లోకి చొరబడ్డారు. వారిని నారాయణన్ అడ్డుకోవడంతో భార్య, ఇద్దరు కుమారుల కళ్లెదుటే ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో శివప్రసాద్, ఆయన సోదరుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రాజకీయపరమైన గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. తాజాగా, ఈ కేసును విచారించిన నెయ్యటిన్‌కర అడిషనల్ సెషన్స్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. విచారణ సమయంలో నిందితులందరూ ఒకే రకమైన దుస్తులు, హెయిర్ స్టైల్‌తో వచ్చి సాక్షులను తప్పదోవ పట్టించాలని చూసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దోషుల్లో కేరళ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి వెల్లమ్‌కొల్ల రాజేశ్ (47), ఆరెస్సెస్ ప్రచారక్ అనిల్ (32) సహా అందరూ ఆరెస్సెస్ కార్యకర్తలే కావడం గమనార్హం.