Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
చిరంజీవి చేసిన ట్వీట్‌లో.. 'మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను' అని ఎంతో బాధగా రాసుకొచ్చారు.