Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించిన కేసీఆర్... బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు స్వయంగా తన కుమార్తె కవితనే పార్టీ మారాలంటూ అడిగారన్న కేసీఆర్... ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు, పార్టీ కీలక నేతలతో కలిసి మంగళవారం కేసీఆర్ ఓ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విరుచుకుపడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ చేయించే ఈ దాడులను తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీతో ఇక పోరాటమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందన్న కేసీఆర్... ఆ దాడులను తిప్పికొట్టే దిశగా నేతలు సిద్ధం కావాలని సూచించారు.