Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త కిరాతకంగా ప్రవర్తించాడు.. మద్యం సేవించడానికి డబ్బుల్లేకపోవడంతో భార్యను మరొకడికి అమ్మేశాడు. అంతేకాదు దగ్గరుండి పెండ్లి చేసి అతడితో పంపించేశాడు. ఎలాగోలా ఆ వ్యక్తి చెర నుంచి తప్పించుకున్న మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కలహండి జిల్లా జరగ్గాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జరగ్గాకు చెందిన ఖిరా బెరుక్ (25) అనే వ్యక్తి పూర్ణిమా భోయ్ (22) అనే మహిళని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఖిరా మద్యానికి బానిస. రోజూ తాగుతూనే ఉండేవాడు. అయితే మందు తాగడానికి డబ్బులు కరువయ్యాయి. కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం చేతకాక తన భార్యను అమ్మేయాలని ఫిక్స్ అయ్యాడు. పని పేరుతో అక్టోబర్ 30న ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఢిల్లీ వెళ్లిన రెండు రోజుల తర్వాత తన భార్యను హర్యానాకు చెందిన వ్యక్తికి విక్రయించాడు. భారీ మొత్తంలో డబ్బులు అందుకున్న తరువాత దగ్గరుండి పెళ్లి జరిపించి ఖీరా వెళ్లిపోయాడు. పూర్ణిమను వివాహం చేసుకున్న వ్యక్తి ఆమెను తనతో పాటు తీసుకెళ్లి నిర్బంధించాడు. ఈ నెల ఐదో తేదీన పూర్ణిమ అతడి చెర నుంచి తప్పించుకుని తన తండ్రికి ఫోన్ చేసింది. భర్త చేసిన దారుణం గురించి వివరించింది. కూతురు చెప్పింది విని నివ్వెరపోయిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి ఖిరా బెరుక్‌తో పాటు పూర్ణిమను పెండ్లి చేసుకున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి పూర్ణిమను తల్లిదండ్రులకు అప్పగించారు.