Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: రైళ్లలో ఆహారం విషయంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రాంతీయ, స్థానిక వంటలకు ప్రాధాన్యమిచ్చేందుకు నిర్ణయించింది. అలాగే, డయాబెటిక్ పేషెంట్లకూ, చిన్నారులకు, ఆరోగ్యంపై శ్రద్ధ కలిగిన వ్యక్తులు కోరే ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగా వీలుగా మెనూలో మార్పులు చేసే సౌలభ్యాన్ని ఐఆర్‌సీటీసీకి కల్పించింది. కేటరింగ్ విభాగాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు ఆహారం విషయంలో మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రాంతీయ వంటకాలు, సీజనల్ వంటకాలతో పాటు, పండగ రోజుల్లో ప్రత్యేక ఆహారాన్ని అందించేందుకు వీలుగా మెనూలో మార్పులు చేసేందుకు ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు అవకాశం ఇచ్చింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, చిన్నారులకు అవసరమైన ఆహారం, తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని అందించేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే రైళ్లలో ఐఆర్‌సీటీసీ సప్లయ్ చేస్తూ వచ్చింది. కొన్ని రైళ్లలో టికెట్‌తో పాటు ఆహారానికీ ఛార్జీని ముందుగానే వసూలు చేస్తారు. అలాంటి ప్రీపెయిడ్ రైళ్లలో సైతం ఇకపై అదనంగా కొన్ని బ్రాండెండ్ ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతారు. దీనికి ధర నిర్ణయించే అధికారం ఐఆర్‌సీటీసీదే. అలాగే మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లో అందించే మెనూలో మార్పులు చేసే అధికారం ఐఆర్‌సీటీసీకి ఇచ్చారు. అయితే, జనతా భోజనానికి సంబంధించి మెనూలో గానీ, ధరలో గానీ ఎలాంటి మార్పూ ఉండదని రైల్వే బోర్డు స్పష్టంచేసింది.