Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కొనసాగుతూనే ఉన్నది. రెండు దేశాలు ఇప్పటికే వేల మంది సైనికులను కోల్పోయాయి. ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. అయినా రష్యా సేనలు ఉక్రెయిన్ నగరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని ఇంధన సదుపాయాలే లక్ష్యంగా దాదాపు 100 క్షిపణులతో రష్యా మంగళవారం దాడి చేసింది.
అక్టోబర్ 10న ఏకంగా 84 క్షిపణులతో దాడి చేసిన రష్యా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగబడిందని ఉక్రెయిన్ అధికారి యూరి ఇగ్నాత్ పేర్కొన్నారు. రష్యా క్షిపణి దాడుల కారణంగా తమ దేశంలోని చాలా నగరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇదిలావుంటే ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ రీజియన్‌లో రష్యా సాగించిన దురాగతాలపై విచారణ చేయనున్నట్టు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఖేర్సన్‌లో రష్యా అనేక మందిని యుద్ధ ఖైదీలుగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టిందని, కొంతమందినైతే కనిపించకుండా చేసిందని ఆరోపణలు వచ్చాయి.