Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డబ్బుల విషయమై తలెత్తిన చిన్న వివాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఓ తల్లి, ఇద్దరు పసివాళ్ల మృతికి కారణమైంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే, వారిని చంపేసి ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూలుకు చెందిన కత్తి మహే్‌షకు, అదే జిల్లాకు చెందిన అనిత(26)తో మూడున్నర సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్ని నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఈ దంపతులు గౌతమీనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి వర్షిణి (22 నెలలు), శ్రీమాన్ (9నెలల) సంతానం. మహేష్ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. అనిత ఇంటి వద్దే ఉంటోంది. కొన్ని రోజుల క్రితం అనిత తన సోదరికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది.
ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మహేష్ పనికి వెళ్తూ ‘డబ్బులు పంపమని మీ వాళ్లకు చెప్పు’ అని అన్నాడు. డబ్బు విషయమై మనస్తాపానికి గురైన అనిత విచక్షణ కోల్పోయింది. పిల్లలకు ఉరి వేసింది. పిల్లలు తుది శ్వాస విడిచిన అనంతరం కన్నీరు మున్నీరవుతూ చున్నీతో తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చిన మహేష్ భార్య ఎంతకూ తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూశాడు. అనిత ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. పక్కింటి వారి సహాయంతో తలుపులు విరగగొట్టి చూడగా, ఇద్దరు పిల్లలు మంచంమీద నిర్జీవంగా పడి ఉన్నారు. బాలానగర్ పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.