Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషుల్లో వీర్య కణాలు
హైదరాబాద్: భారత దేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో పురుషుల్లో వీర్య కణాలు గత కొన్ని సంవత్సరాల నుంచి తగ్గిపోతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. 53 దేశాల్లో ఈ అధ్యయనం జరిగినట్లు తెలిపింది. గతంలో సమీక్షించని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలోని పురుషుల వీర్య కణాల తీరుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. అదనంగా 2011 నుంచి 2018 వరకు సమాచారాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపింది. ఉత్తర అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలలోని పురుషుల్లో టోటల్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ కాన్సంట్రేషన్ గతంలో కన్నా ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించినట్లు తాజా సమాచారం చెప్తోందని, ఈ పరిస్థితి కనిపించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. 2000వ సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ తగ్గుదల వేగం పెరిగినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెం హిబ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హగాయ్ లెవినే మాట్లాడుతూ, పురుషుల్లో వీర్య కణాల తగ్గుదల ధోరణి ఎక్కువగా కనిపిస్తున్న దేశాల్లో భారత దేశం ఒకటి అని తెలిపారు. భారత దేశానికి సంబంధించిన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉందని తెలిపారు. దీనిని పరిశీలించినపుడు వీర్య కణాల క్షీణత నిలకడగా కొనసాగుతోందని తాము కచ్చితంగా నిర్థరించామని చెప్పారు. మొత్తం మీద గత 46 ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికిపైగా స్పెర్మ్ కౌంట్స్ తగ్గినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని మెరుగుపరచకపోతే మానవాళి మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందని చెపుతున్నారు. ఈ అధ్యయన నివేదిక హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.