Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీల్లి: ఇండొనేషియా బాలిలో జి20 సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మధ్య కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది. సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ మీడియాకు లీక్ చేయడాన్ని జిన్‌పింగ్ తప్పుబట్టినట్లు, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నివివరాలూ మీడియాకు ఎందుకిచ్చారని, అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదన్నారు. చర్చలు జరిపే పద్ధతే ఇది కాదన్నారు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదని వాదించారు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందామని జిన్‌పింగ్ కుండబద్దలు కొట్టారు. చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ లేదని కెనడా ప్రధాని ట్రుడో వాదించారు. ఇలా ఇద్దరు నేతలూ మాట్లాడుకునేది కెనడా జర్నలిస్ట్ తన కెమెరాలో రికార్డ్ చేశారు. రెండు దేశాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఉత్తరకొరియా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై చర్చించారు. కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని ట్రుడో తప్పుబట్టారు. వాస్తవానికి చర్చలకు ఒక రోజు ముందు కెనడా వాణిజ్య రహస్యాలను చైనాకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఓ చైనా జాతీయుడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కెనడాలో అమెరికా అరెస్ట్ వారంట్‌పై చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్ట్ చేసినప్పుడు చైనా మండిపడింది. ఆ వెంటనే ఇద్దరు కెనెడా జాతీయులను గూఢచర్యం ఆరోపణలపై చైనా అరెస్ట్ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదే తరుణంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరగడం కొంత ఆలోచింపజేస్తుంది.