Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని దవాఖానను గురువారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సద్గురు మధుసూదన సాయి ప్రారంభించనున్నారు. సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దవాఖానను ఐదెకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2022 జనవరి 17న దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేయగా, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ దవాఖానలో తల్లులతోపాటు గుండె సంబంధిత జబ్బులతో జన్మించే శిశువులకు ప్రత్యేక వైద్యసేవలను ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే ట్రస్ట్.. నయా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), పల్వాల్ (హర్యా నా), నవీ ముంబై (మహారాష్ట్ర)లో దవాఖానలు నిర్వహిస్తున్నది.
తాజాగా కొండపాకలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్య సేవలతోపాటు మందులను అందించనున్నది. 100 పడకల సామర్థ్యం, ఆధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు, పూర్తిస్థాయి డిజిటల్ ల్యాబ్ పరికరాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24గంటలపాటు వైద్య సేవలు అందుబాటు లో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఉచితంగా ఆపరేషన్లు చేయడంతో పాటు భోజ నం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఏటా 3 లక్షల మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో సుమారు 75 వేల మంది చిన్నారులు పసి ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాం టి చిన్నారులను కాపాడటానికి సత్యసాయి ట్రస్ట్ ఈ దవాఖానలు ఏర్పాటు చేసింది.