Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ''మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకివే చివరి ఎన్నికలు.. టీడీపీని గెలిపించండి, అసెంబ్లీని గౌరవసభ చేస్తా''.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లాలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టుకు తాను అడ్డు పడుతున్నానని.. దుష్ప్రచారం చేస్తున్నారనీ.. అంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుండి ఉపయోగమేంటి? వాళ్లు రాష్ట్రానికి ఏమైనా పనికొస్తున్నారా? అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. అయితే పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ తగిలింది. ర్యాలీగా వస్తుండగా కొందరు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. బాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కట్టడి చేయడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలింది.
ఇదిలా ఉంటే .. ఓవైపు మూడు రాజధానుల నినాదాలు.. మరోవైపు చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా పొలిటికల్ హీటెక్కింది. తాను కర్నూలుకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. కోడుమూరులో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. బాబు పర్యటనకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీ టార్గెట్‌గా పదునైన విమర్శలు చేశారు చంద్రబాబు. అమ్మ ఒడి- నాన్న బుడ్డికి సరిపోయిందని.. నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు- మూడు పేకాటల ప్రస్తావన తీసుకొస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే వైసీపీ గుండాలు అరాచకాలు సృష్టిస్తూ కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేననీ.. అప్పుడు వైసీపీ గుండాలను తరిమికొడతామని హెచ్చరించారు. కోడుమూరు, దేవనకొండ, పత్తికొండలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. నిన్న రాత్రి ఆదోనిలో బస చేసిన చంద్రబాబు. ఈరోజు ఉదయం 11 గంటలకు రోడ్‌షో తిరిగి ప్రారంభిస్తారు. ఎమ్మిగనూరు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు.