Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: మరణశిక్షల అమలుపై ప్రపంచ వ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆయా దేశాలు మాత్రం తమ చట్టాల ప్రకారం వాటిని అమలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అత్యంత అరుదుగా సంభవించే సామూహిక మరణ శిక్షలను కువైట్ తాజాగా అమలు చేసింది. హత్యలతోపాటు వివిధ కేసుల్లో దోషులుగా తేలిన ఏడుగురి ఖైదీలకు కువైట్ కేంద్ర కారాగారంలో మరణశిక్ష విధించినట్లు వెల్లడించింది.
సామూహిక మరణశిక్ష విధించిన వారిలో ముగ్గురు కువైట్‌కు చెందిన పురుషులు, ఒక కువైట్ మహిళ ఉన్నారు. వీరితోపాటు సిరియా, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ఇథోయోపియాకు చెందిన మరో మహిళ ఉన్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.అయితే, ఏ పద్ధతిలో వారికి మరణశిక్ష అమలు చేశారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగా అక్కడ ఉరితీసే పద్ధతిని పాటిస్తున్నారు. మరణశిక్ష పడిన దోషులను సైనికులతో కాల్చి చంపే విధానాన్ని కూడా ఆ దేశం అమలు చేస్తోంది. కువైట్‌లో మరణ దండన అరుదనే చెప్పవచ్చు. 2017 నుంచి ఇప్పటివరకు ఒక్క మరణ శిక్ష కూడా అమలు చేయలేదు. ఆ ఏడాది ఒకేసారి ఏడుగురికి మరణశిక్ష పడింది. అందులో కువైట్‌లో అధికారంలో ఉన్న వారి కుటుంబ సభ్యుడు కూడా ఉన్నారు. అంతకు ముందు 2013లో ముగ్గురికి ఈ శిక్ష అమలు చేశారు. అయితే, కువైట్‌లో సామూహిక మరణశిక్షలను అమలు చేయడాన్ని యూరోపియన్ యూనియన్ తప్పుపట్టింది. ఈ చర్య వల్ల వీసా లేకుండా ఈయూలో పర్యటించే వారి జాబితాలో కువైట్ పేరు కోల్పోయే సూచనలున్నాయి తెలిపింది. దీనిపై ఈయూ పార్లమెంట్ ఓటింగ్ నిర్వహించే ఒకరోజు ముందే సామూహిక మరణశిక్షలు అమలు చేయడంతో ఈయూ దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.