Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్: నాటో సభ్యదేశమైన పోలండ్ సరిహద్దుల్లోని షెవాడో గ్రామంపై క్షిపణి దాడి ఘటనలో తమను నిందించడం సరికాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 దేశాల సదస్సు జరుగుతుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలండ్ శివారులోని షెవాడో గ్రామంపై ఓ క్షిపణి కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇది రష్యా ప్రయోగించిన క్షిపణే అని తొలుత ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే, అది రష్యా నుంచి వచ్చింది కాదని ఆ తర్వాత ప్రాథమికంగా తేలింది. దీనిపై పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా మాట్లాడుతూ.. రష్యా దాడులకు ప్రతిగా ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి దురదృష్టవశాత్తూ తమ భూభాగంలో పడిందని, ఇది కావాలని చేసింది కాదని తెలిపారు.
ఈ క్రమంలోనే నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ స్పందిస్తూ ఉక్రెయిన్‌పై విమర్శలు చేశారు. కీవ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల వల్లే పోలండ్ ఘటన జరిగిందని అన్నారు. అయితే, దీనిపై జెలెన్‌స్కీ తాజాగా స్పందించారు. ''అది మా క్షిపణి కాదని టాప్ కమాండర్లు నాకు స్పష్టంగా చెప్పారు. ఈ ఘటనకు ఉక్రెయిన్‌ను నిందించడం సరికాదు. అయితే, నిజానిజాలను తెలుసుకునేందుకు క్షిపణి పేలిన ప్రాంతంలో దర్యాప్తు జరిపేందుకు ఉక్రెయిన్ అధికారులకు అనుమతినివ్వాలని కోరుతున్నా'' అని జెలెన్‌స్కీ తెలిపారు. కాగా.. పోలండ్‌లో పడిన క్షిపణి సోవియట్ కాలం నాటిది.