Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 'కుండబద్దలు' పేరిట ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న కాటా సుబ్బారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేయగా, ఏపీ హైకోర్టు నేడు స్టే ఇచ్చింది. మూడు రాజధానుల అంశంలో 'కుండబద్దలు' సుబ్బారావు సీఎం జగన్, రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డిలపై కుట్ర పూరితంగా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై ఆయనపై అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై 'కుండబద్దలు' సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరిగింది. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదించారు. ఎమ్మెల్యేపై అసత్యప్రచారాలు చేస్తున్నారని ఒక కార్యకర్త ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసుపై పూర్తిస్థాయి స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.