నవ తెలంగాణ-నవీపేట్: మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మండలంలోని జన్నేపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సమక్షంలోనే గురువారం వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోని మాటు కాల్వ పై అక్రమంగా నిర్మించారని ఇరిగేషన్ అధికారులు కొందరివి మాత్రమే నిర్మాణాలు తొలగించారని ఈ విషయమై ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను విన్నవించేందుకు స్థానికులైన ప్రదీప్, రాజు, సురేష్ లు స్టేజి పైకి రాగా ఉప సర్పంచ్ గౌరు రాజు ఆగ్రహంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు మీరెందుకు సమావేశానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము స్థానికులమేనని మా గ్రామానికి సమస్యలు తెలుసుకున్నందుకే ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తుండడంతోనే వచ్చామని ప్రతిపక్షమైతే వినతులు తీసుకోరా అని వారు ప్రశ్నించారు. దీంతో గందరగోళ వాతావరణం ఏర్పడడంతో స్థానిక నాయకులు సముదాయించడంతో సద్దుమణిగింది. దీంతో సమావేశంలో అనవసరంగా గందరగోళం ఏర్పడినందుకు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.