Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్యాంకు కస్టమర్లకు కీలక అప్రమత్తత. కొన్ని బ్యాంకులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిరంతరాయంగా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ రేపు (నవంబర్ 19, శనివారం) సమ్మె నిర్వహించతలపెట్టింది. ఈ ప్రభావం ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యకలాపాలపై పడే అవకాశం ఉంది. ఇందులో బ్యాంకు ఆఫీసర్ల భాగస్వామ్యం లేకపోయినప్పటికీ సమ్మె తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం నగదు డిపాజిట్లు, ఉపసంహరణ, చెక్కుల క్లియరెన్స్ వంటి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ఎప్పటిలాగానే సాధారణ కార్యకలాపాలు కొనసాగనున్నప్పటికీ.. బ్రాంచులు, ఆఫీస్‌లకు సంబంధించిన కొన్ని సెక్షన్ల ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉండడంతో కొంతమేర ప్రభావం పడే సూచనలున్నాయని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది.
కాగా కొన్ని బ్యాంకులు నిరంతరాయంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కొనసాగించడాన్ని ఏఐబీఈఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కస్టమర్లు గోప్యత, డబ్బు ప్రమాదంలోకి నెట్టినట్టేనని చెబుతోంది. అంతేకాకుండా నియామకాలు కూడా కనిష్ఠస్థాయికి దిగజారుతున్నాయని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. కొన్ని బ్యాంకులైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.