Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో శుక్రవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్టర్ తమిళ పరీక్షలో అవకతవకలు జరిగాయి. తమిళ పాఠ్యాంశానికి సంబంధించి ఇచ్చిన ప్రశ్నపత్రం చూసి విద్యార్థులు దిగ్ర్భాంతి చెందారు. తమకిచ్చిన ప్రశ్నపత్రం గత యేడాదికి చెందినదని తెలుసుకుని విస్తుపోయారు. ఈ విషయాన్ని విద్యార్థులు పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇక మూడో సెమిస్టర్ తమిళ పాఠ్యాంశం ప్రశ్నపత్రానికి బదులుగా గత యేడాది నిర్వహించిన నాలుగో సెమిస్టర్ తమిళ పాఠ్యాంశం ప్రశ్నపత్రం ఇచ్చి మద్రాసు వర్సిటీ పాలకులు తమ అసమర్థతను చాటుకున్నారు. ఈ విషయం వెల్లడి కాగానే వర్సిటీ పాలకుల ఆదేశం మేరకు విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాలన్నింటిని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులు ఆలస్యంగా కొత్త ప్రశ్నపత్రం ఇస్తారని వేచి చూశారు. చివరకు శుక్రవారంనాటి మూడో సెమిస్టర్ తమిళ పాఠ్యాంశం పరీక్ష రద్దు చేసినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉండగా మద్రాసు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తమిళ పాఠ్యాంశం పరీక్షలో పాత ప్రశ్న పత్రం ఇచ్చిన విషయంపై విచారణ జరుపనున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి తెలిపారు. ఈ తప్పిదానికి కారకులైనవారిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.