Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: భారతీయ వారసత్వ కట్టడంగా పేరుగాంచిన మద్రాస్ హైకోర్టు భవనంలోని ఆరు ప్రవేశద్వారాలను శనివారం రాత్రి ఎనిమిది గంటలకు మూసివేశారు. హైకోర్టు భవనంలో రోజూ నాలుగైదు ప్రవేశద్వారాలు మాత్రమే మూసివేస్తారు. తక్కిన ప్రవేశద్వారాల్లో భద్రతా విధులు చేపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు వెళ్లి గస్తీ తిరుగుతుంటారు. హైకోర్టు సిబ్బంది అత్యవసర పనుల నిమిత్తం వచ్చి వెళుతుంటారు. అయితే యేడాదికి ఒకసారి అన్ని ప్రవేశద్వారాలకు తాళాలు వేయడం ఆనవాయితీగా ఉంటోంది. ఈ భవనాలను ఆంగ్లేయులు నిర్మించడంతో వారిని స్మరించుకునేలా యేడాదికొకమారు 24 గంటలపాటు హైకోర్టు ప్రవేశద్వారాలన్నింటికి తాళాలు వేసి మూసివేస్తారు ఆంగ్లేయుల కాలం నుండే ఈ ఆచారం అమలులో ఉంది. ఆ మేరకు శనివారం రాత్రి ఎనిమిది గంటలకు తాళాలు వేసి హైకోర్టు ప్రవేశ ద్వారాలను మూసివేశారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకూ ఈ ప్రవేశద్వారాలు మూసే ఉంటాయి. అంతేకాకుండా హైకోర్టు లోపలకు ఎవరినీ అనుమతించకుండా గట్టి పోలీసు భద్రత కూడా ఏర్పాటైంది. ఈ కోర్టు గేట్ల తాళాలను ఒక రోజంతా పూజారి లేదా చర్చి ఫాదర్ వద్ద వుంచి పూజలు చేయిస్తారంటూ పుకార్లు కూడా వున్నాయి. అయితే ఈ పుకార్లను గతంలోనే హైకోర్టు ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.