Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సికింద్రాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. గబ్బిలాల పేట ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మంత్రి ఇప్పటివరకూ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్‌లో 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి హామీలకే పరిమితమయ్యారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, తెరాస నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి ఒకరినొకరు తోసుకున్నారు. జవహర్ నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో మంత్రి పరిష్కారం చూపాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు.