Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 11న హర్యానా, ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింగు వద్దకు భారీగా తరలి రానున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తోపాటు ప్రతి చోట నుంచి రైతులు ఇక్కడకు చేరుకుంటారని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు అభిమన్యు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిపిన పోరాటంలో అసువులు బాసిన రైతులకు నివాళి అర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కాగా, గత ఏడాది డిసెంబర్‌లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీలు ఇవ్వడంతో నిరసనలను విరమించి ఇళ్లకు చేరామని అభిమన్యు తెలిపారు. అయితే ఏడాది అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేరలేదన్నారు. రైతులకు ప్రధానమైన కనీస మద్దతు ధర అంశంపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని ఆయన విమర్శించారు. అలాగే రైతులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తామన్న కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్యమించేందుకు రైతులు సిద్ధమవుతున్నారని ఆయన వెల్లడించారు.