Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతకొన్ని రోజులుగా పలు గ్రామాల్లో పులి సంచరిస్తున్న తరుణంలో బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో అది తీవ్రంగా గాయపడింది. దీనిని సోమవారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆదివారం బాబాసాగర్ ఏరియా కుంట వద్ద స్థానికులకు పులి కనిపించింది. రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ మండలంలోని వేంపల్లి అనుకోడ గ్రామ శివారులో పెద్దపులి కొందరు ప్రయాణికులకు కనిపించింది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ఖానాపూర్, కాగజ్ నగర్, ఈజ్ గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకుందన్నారు. దాని ఆచూకీ కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని తెలిసింది.