Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన్‌రావు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు 40-50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్థిరపడ్డారు. ఆదివారం సెలవు కావడంతో తన కుటుంబంతో స్వస్థలమైన అద్దంకి వెళ్లారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన ఒంగోల్‌లోని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆయన కుమారుడు ప్రమోద్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని బలంగా సమర్థించిన ఇలపావులూరి పత్రికల్లో వ్యాసాలు, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్పేవారు. ఈ తరుణంలో ఇలపావులూరి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన చేసే చర్చలు, విశ్లేషణలు, రచనలు ముక్కుసూటిగా ఉండేవని చెప్పారు. తెలంగాణ ప్రజల శ్రేయోభిలాషిగా తెలంగాణ వాదాన్ని వినిపించిన కాలమిస్ట్ అని గుర్తుచేసుకున్నారు. ఇలపావులూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.