Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహువా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారజోరు పెంచాయి. గత కొన్ని రోజులుగా భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తొలిసారిగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ఆదివాసీల నుంచి భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్ నేడు సూరత్ జిల్లాలోని మహువా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఆదివాసీలే ఈ దేశానికి తొలి యజమానులు. కానీ బీజేపీ వారిని 'వనవాసులు'గా పిలుస్తోంది. మీరు నగరాల్లో ఉండాలని, మీ పిల్లలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని ఆ పార్టీ కోరుకోవట్లేదు. ఈ అడవుల్లోనే అణగారిపోవాలని అనుకుంటోంది. అది అక్కడితో ఆగిపోదు. ఆ తర్వాత మీ అడవులను కూడా వారు లాగేసుకుంటారు. బీజేపీ ఇలాగే అధికారంలో కొనసాగిస్తే వచ్చే 5-10 ఏళ్లలో అడవులన్నీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అప్పుడు మీకు ఉండటానికి చోటు కూడా మిగలదు'' అంటూ భాజపాపై విరుచుకుపడ్డారు.
ఈ దేశ ప్రజలను ఐక్యం చేసేందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని రాహుల్ తెలిపారు. యాత్రలో భాగంగా తాను ఎంతోమంది రైతులు, యువత, ఆదివాసీ తెగ ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకున్నానని చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్ నేడు రాజ్‌కోట్‌లోనూ ప్రచారం చేపట్టనున్నారు. అటు బీజేపీ కూడా ముమ్మర ప్రచారం చేస్తోంది. తన స్వరాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ఒకేరోజు మూడు ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నేడు రాష్ట్రంలో పర్యటించారు.