Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకర్తా: ఇండోనేషియాపై ప్రకృతి కన్నెర్రజేసింది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించింది. మధ్యాహ్నం 10-15 సెకన్లపాటు ప్రధాన భూభాగమైన జావాలో 5.6 తీవ్రతతో బీభత్సం సృష్టించిన భూప్రకోపం 162 నిండు ప్రాణాలను బలిగొంది. సాయంత్రం 7 గంటల వరకు ఇదే ప్రాంతంలో 1.5 నుంచి 4.8 తీవ్రతతో మొత్తం 62 సార్లు భూమి కంపించింది. రాత్రి 9.16కు జకర్తా వాయవ్య ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అక్కడ కూడా జనావాసాలు పెద్దసంఖ్యలో నేలమట్టమైనట్లు తెలుస్తోంది. అక్కడ మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం 12.30 సమయంలో తొలుత జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 10-15 సెకన్లపాటు భూమి కంపించడంతో జావా ద్వీపం వణికిపోయింది. 162 మంది మృతిచెందినట్లు ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ చీఫ్ సుహర్యంటో వెల్లడించారు. సియాంజుర్‌లో ఓ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్, రీజినల్ ఆస్పత్రితోపాటు.. పలు ఆవాస ప్రాంతాలు, నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, ఒక ప్రార్థన మందిరం, మూడు స్కూళ్ల గోడలు కుప్పకూలాయి. ఇక్కడే మృతుల సంఖ్య అధికంగా ఉందని, మరణించిన వారిలో చిన్నారులే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. 700 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు.
వందల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని, మరణాల సంఖ్య పెరిగే ప్రమాదముందని సియాంజుర్ నగర పరిపాలన అధికారి సుహెర్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను సోమవారం సాయంత్రం సందర్శించిన ప్రాంతంలోనే ఓ భవనం శిథిలాల కింద 25 మంది దాకా చిక్కుకుపోయినట్లు గుర్తించామన్నారు. ఎక్కడికక్కడ గుడారాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలను తరలిస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(బీఎన్‌పీబీ) డైరెక్టర్ జనరల్ అబ్దుల్ మొహాలీ పేర్కొన్నారు. మొత్తం 13 వేల మంది పౌరులు నిరాశ్రయులైనట్లు తెలిపారు. 2,272 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.