Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా పనిచేసిన రెవెన్యూ ఉద్యోగి దేవేందర్ కుమారుడు కేసిరెడ్డి అక్షయ్‌కుమార్ (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. అక్షయ్ మహబూబ్‌నగర్ జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ స్కాంలో నిందితుడని పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ గోనె సురేశ్ కథనం మేరకు వివరాలు ఇలా... మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన అక్షయ్ కుమార్.. అమెజాన్ సంస్థలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. కొండాపూర్‌లోని శిల్పవ్యాలీలో నివాసం ఉండే అక్క మల్లిక వద్ద ఉంటున్నాడు. ఈ నెల 19న అక్క మల్లిక, బావ నవీన్ ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్షయ్‌ని పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో వారు మరో తాళం చెవితో తలుపు తీశారు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్షయ్ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు.
దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీఐ తెలిపారు. తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. అక్షయ్ తండ్రి ప్రస్తుతం మంత్రి వద్ద విధులు నిర్వహించడం లేదని పోలీసులు చెప్పారు.