Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని బైక్ పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఒక బాంబు పేలిపోగా అక్కడ పడి ఉన్న మరో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు, ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాలిలా
మంగళవారం ఉదయం కార్గో సామాగ్రిని తరలించే తూపుడు బండి కార్మికుడు దండి ఐలయ్య తన బండిని బైక్ పార్కింగ్ పక్కనే పెట్టుకునేందుకు వెళ్లాడు. తూపుడు బండి చక్రం కింద ఉన్న నాటుబాంబు అకస్మాత్తుగా పేలింది. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే బస్టాండ్ కంట్రోలర్ తిరుమల్‌రావు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి వచ్చిన ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్ అక్కడ మరిన్ని నాటుబాంబులను గుర్తించి బాంబ్, డాగ్ స్కాడ్ బృందాలను రప్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు చెల్లా చెదురుగా పడేసిన ఐదు నాటు బాంబులను వారు స్వాధీనం చేసుకున్నారు. నల్లమందు(గన్‌పౌడర్) తయారు చేసిన నాటు బాంబులని, వీటిని అడవి పందులు, ఊరపందులను వేటాడేందుకు వేటగాళ్లు ఉపయోగిస్తారని ఏసీపీ సతీశ్ తెలిపారు. దారాలు, సుతిళ్లతో చుట్టి తయారుచేసిన ఈ బాంబుపై ఒత్తిడి పడితే పేలిపోతుందన్నారు. ఈ నాటు బాంబులకు మాంసాన్ని గానీ, రక్తాన్ని గానీ పూసి ఎరవేస్తే పందులు వాటిని నోటిలో పెట్టుకొని కొరకడంతో పేలిపోయి అక్కడికక్కడే చనిపోయే అవకాశం ఉందన్నారు. ఈ సంఘటనలో ఎవరికీకి గాయాలు కాలేదన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.